మాటల కంటే మౌనం గొప్పదని నిరూపించిన మహానుభావులు ఎందరో!మౌనంగా ఉంటే వ్యవహారం ఎలా సాగుతుందని ప్రశ్నించేవారూ ఉన్నారు. ఎక్కడ ఏ సమయానికి ఏది మాట్లాడాలో తెలిసినవారే చతురులు, చమత్కారులు. సమయస్పూర్తి కలిగినవారు. కొందరు మాటలను తూటాల్లా పేలుస్తారు. కొందరు నర్మగర్భంగా మాట్లాడతారు. కొందరు పుల్ల విరిచినట్లు మాట్లాడి నెత్తి మీదకు తెచ్చుకుంటారు. మనకు స్వర పేటికను ఉన్నది మాట్లాడటానికే. చక్కగా మాట్లాడుతుంటే కొందరికి హాయిగా ఉంటుంది. ఏమీ మాట్లాడకుండా ఉండాలంటే కాళ్లు, చేతులు కట్టేసినట్లుంటుంది. మరి కొందరు వాగుడుకాయలు. లొడలొడ వాగుతారు. ఏం మాట్లాడతారో వాళ్లకే తెలియనట్లు మాట్లాడతారు. పిచ్చివాడి వ్రేలాపనలా ఉంటుంది. వాళ్ల మాటతీరు. మాటల్ని జాగ్రత్తగా వాడాలి. పొదుపుగా ఉపయోగించాలి. అంగడినుంచి కొనుక్కుని తెచ్చుకున్నట్లు మాట్లాడాలి. అవసరమైతే బంగారంలా మాట్లాడాలి. మాట ఔషధంలా పని చేస్తుంది. మంత్రంలా ప్రభావం చూపుతుంది. మాట రాయబారిగా పని చేస్తుంది. ఒక్కోసారి మాట పెద్ద పెద్ద కార్యాలు చక్కబెడుతుంది. మాటలు విడిచి పెట్టి...