మాటల కంటే మౌనం గొప్పదని నిరూపించిన మహానుభావులు ఎందరో!మౌనంగా ఉంటే వ్యవహారం ఎలా సాగుతుందని ప్రశ్నించేవారూ ఉన్నారు. ఎక్కడ ఏ సమయానికి ఏది మాట్లాడాలో తెలిసినవారే చతురులు,
చమత్కారులు. సమయస్పూర్తి కలిగినవారు.
కొందరు మాటలను తూటాల్లా పేలుస్తారు. కొందరు నర్మగర్భంగా మాట్లాడతారు. కొందరు పుల్ల విరిచినట్లు మాట్లాడి నెత్తి మీదకు తెచ్చుకుంటారు.
మనకు స్వర పేటికను ఉన్నది మాట్లాడటానికే. చక్కగా మాట్లాడుతుంటే కొందరికి హాయిగా ఉంటుంది. ఏమీ మాట్లాడకుండా ఉండాలంటే కాళ్లు, చేతులు కట్టేసినట్లుంటుంది. మరి కొందరు వాగుడుకాయలు. లొడలొడ వాగుతారు. ఏం మాట్లాడతారో వాళ్లకే తెలియనట్లు మాట్లాడతారు. పిచ్చివాడి వ్రేలాపనలా ఉంటుంది. వాళ్ల మాటతీరు. మాటల్ని జాగ్రత్తగా వాడాలి. పొదుపుగా ఉపయోగించాలి. అంగడినుంచి కొనుక్కుని తెచ్చుకున్నట్లు మాట్లాడాలి. అవసరమైతే బంగారంలా మాట్లాడాలి.
మాట ఔషధంలా పని చేస్తుంది.
మంత్రంలా ప్రభావం చూపుతుంది. మాట రాయబారిగా పని చేస్తుంది. ఒక్కోసారి మాట
పెద్ద పెద్ద కార్యాలు చక్కబెడుతుంది.
మాటలు విడిచి పెట్టిన బాణాల్లాంటివి. మాట్లాడేటప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకసారి వదిలి పెట్టిన తరవాత లక్ష్యాన్ని
వేదించక మానవు. మనసులను గాయపరచక వదలవు.
చిన్నపిల్లలైనా, పెద్దవారైనా కొన్ని
మాటలకు నొచ్చుకుంటారు. కొన్నిసార్లు మాటలకు మెచ్చు కుంటారు. నొప్పించే మాటలతో మళ్లీ ముఖం చూడలేని పరిస్థితి ఏర్పడుతుంది. మాట వెనక నేను ఉంటుంది. ఎవరితో మాట్లాడుతుంటామో వాళ్లకి నేను
ఉంటుంది. మాట సూటిగా నేనును కదుపుతుంది. అది అహాన్ని దెబ్బతీస్తుంది. మంచికైనా చెడుకైనా మాటే ఆయుధం.
జ్ఞానుల మాటలన్నీ బోధలే.మాట్లాడటం నేర్చుకోవాలి. ఎందుకు? మనకు జ్ఞానం ఉంది కదా మాట్లాడగలం అనుకుంటారు. ఆ జ్ఞానం వెనకే అహం ఉంటుంది. పాండిత్యం ఉంది. కదా,చాకచక్యంగా మాట్లాడగలం అనుకుంటారు. దాని వెనకే కనపడని నేను కాచుకుని ఉంటుంది.
విద్యా వినయంతో, వంగిపోయిన చెట్టులాగ ఉండి ఫలపుష్పభరితమై అందరినీ
చక్కటి ప్రేమ పూర్వకమైన సంభాషణతో అలరించాలి. మాటలు వింటుంటే గంధం
పూసినట్లుండాలి. తేనె చప్పరించినట్లుండాలి. హృదయం పరవశంతో ఊగిపోవాలి.
శక్తిమంతమైన మాటలే హృదయ వైశాల్యాన్ని పెంచుతాయి. కాకులు అరుస్తూనే ఉంటాయి.
కోయిలలు వసంతంలోనే పాడుతాయి. మహాగాయకుడు మంచి వేదిక పైనే గళం విప్పుతాడు.మాట మీద ఎరుక ఉంచాలి. అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ
మంచినే మాట్లాడాలి. మంచిగా మాట్లాడాలి. మంచికోసమే మాట్లాడాలి.అలా మాట్లాడితే ఆరోగ్యం, ఆనందం, ఆధ్యాత్మికత వద్దన్నా లభిస్తాయి.
- ఆనందసాయి స్వామి.
(25.7.20 ఈనాడు అంతర్యామి)
Comments
Post a Comment