మతం పునాదిగా మనుషుల్ని వేలాది సంకుచిత విభాగాలుగా విభజించిన కులభావాలను వదలించుకోవాలి.
ఆధునిక విజ్ఞానం వెలుగులో హేతుబద్దంగా ,కార్యకారణ బద్ధంగా, వివేకంతో వివేచన చేయాలి.
హేతువిరుద్ధమైన భావాలను ప్రశ్నించాలి. వాటిని తిరస్కరించాలి.
సంకుచితమైన జాతి,కుల,వర్గ,లింగ భావాలను వదలించుకోవాలి.
ఏదో గ్రంథం చెప్పిందనో, ఎవరో చెప్పినారనో కాక స్వతంత్రంగా ఆలోచించాలి.
మనిషికి అంతిమ ప్రమాణం హేతుబద్ధ ఆలోచనే.
విశ్వమంతా నియమబద్ధంగా పరిణామశీలం కలిగిఉంది.
ఈ అవగాహన లో భాగమే ఆధునిక విజ్ఞానం.
విశ్వమంతా పలు సంఘటనల మయం.ఒక సంఘటన మరొక సంఘటనకు కారణమవుతుంది.అదొక నిరంతర ప్రక్రియ.
ఈ కార్యకారణ అవగాహనే జ్ఞానానికి తద్వారా సత్యావిష్కరణ కు దారి చూపుతుంది.
మానవుడి లక్ష్యం స్వేచ్ఛ.
ప్రకృతి దౌష్ట్యాలనుండి , సంకుచిత సమిష్టుల నుండి, మార్మిక సిద్ధాంతాలనుండి , పక్షపాత రాజకీయ పార్టీల నుండి, మనుషుల క్రూరత్వంనుండి , నిరుద్యోగం, దారిద్ర్యం, ఆకలి లేని స్వేచ్ఛా
ప్రపంచం మనిషికి అవసరం.
సమాజాన్ని తన శ్రేయస్సుకోసం మనిషి రూపొందించుకున్నాడు.
సమాజంకోసం మనిషి బలికారాదు.
మనిషి కోసంసమాజం, సమాజం కోసం మనిషి
ఇదొక నిరంతర ప్రక్రియ
మనిషి తమ శ్రేయస్సుకోసం, స్వేచ్ఛకోసం రాజకీయ, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక సంస్థలను, వ్యవస్థలను నిర్మించుకున్నాడు.
జ్ఞానం, అనుభవం ద్వారా అవసరమైనప్పుడు ఈ సంస్థలను, వ్యవస్థలను మార్చుకోవడం లేదా, పునర్నిర్మించుకోవడం చేస్తాడు.
అవి నిరంతర సంస్కరణకు, పరిణామాలకు గురి కావాలి.
వాటి అభివృద్ధే మానవాభివృద్ధి.
అభివృద్ధి ఫలాలను ప్రతి వ్యక్తీ అనుభవించాలి.
వ్యక్తుల జీవన స్థాయిని బట్టి సమాజ స్థాయిని నిర్ణయించాలి.
మనం మారితే సమాజం మారుతుంది.
ముందు మనం మారకుండా ఈ వ్యవస్థ మారాలనడం సరి కాదు.
మనుషుల మధ్య సహకార పూర్వక సామాజిక, ఆర్ధిక సంబంధాలు ఉండాలి.
మనుషులంతా సమానమని గుర్తించాలి.
ఎలాంటి నియంతృత్వ విధానాలను ఆమోదించరాదు.
మనుషులు తమను తాము పరిపాలించుకోగల శక్తియుక్తులు పెంచుకోవాలి.
తమ అధికారాన్ని ప్రతినిధికి ఇచ్చి ప్రజలు ప్రేక్షకులు కారాదు.
అధికార రాజకీయాలను, వాట సాధింపుకోసం పక్షపాత మార్గాలను అనుసరించే రాజకీయ పార్టీలను తిరస్కరించాలి.
పార్టీ రహితంగా ప్రజలు తమ అధికారాన్ని తమ దగ్గర ఉంచుకొని తమను తాము తమ అభివృద్ధికోసం పరిపాలించుకోవడంలో క్రియాశీలురు కావాలి.
ఉచిత పథకాలను తిరస్కరించాలి.
ప్రభుత్వాలకు ప్రజలు మన్నులు కట్టేది ఉచిత పథకాల కోసం కాదని గుర్తించాలి.
ప్రభుత్వాలు ప్రజల నిధులతో ప్రజాభివృద్ధికి అభివృద్ధి పథకాలను అవినీతి రహితంగా అమలు చేసేట్లు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆధునిక విజ్ఞాన శాస్త్రం అందించే సాంకేతిక ఫలితాలతో పాటు అది అందించే జీవన తాత్విక ఫలితాలను కూడా ఉపయోగించుకుని నిత్యజీవన విధానాన్ని మెరుగు పరచుకోవాలి.
మానవ భవిష్యత్తు స్వేచ్ఛా సమానత్వాలతో, సౌభ్రాతృత్వంతో స్వేచ్ఛామయం కావాలి.
ఈనాటి దీనాతి దీన స్థితి నుండి బయటపడాలి.
Comments
Post a Comment