అనూహ్యంగా ఒకరోజు,
హాస్టల్ నుండో, కాలేజ్ నుండో అమ్మనాన్నల దగ్గర నుండి పిలుపొస్తుంది..
ఇంటికొచ్చిన ఆనందం ఇంకా తీరకముందే ఒక చేదువార్త పెళ్ళి చూపులని....
సాధించాలనుకున్న కలలు,
అప్పుడప్పుడే తెలుసుకుంటున్న లోకం తీరు, తనకోసం తాను ఆలోచించుకోవడం అప్పుడే మొదలౌతుండగానే
పెళ్ళి అనే బంధనం...
గంగిరెద్దు లా అలంకరించి కూర్చోబెట్టిన ఒక వస్తువులా,
హైరానా పడుతున్న అమ్మా నాన్నా,
మొదటి సంబంధమే కుదిరిపోవాలని మొక్కుతూ నాయనమ్మ...
ఏం జరుగుతుందో అర్థం కాక, భయం, ఆందోళనలతో మౌనంగా కూర్చున్న తనను శల్య పరీక్షలు చేస్తూ,
ప్రశ్నలడిగి గుచ్చి గుచ్చి చూస్తూ....,
బేరసారాలాడి, నాన్న నుండి ఎంత ఎక్కువ లాగొచ్చో అంత కట్నం రూపంలో లాగడానికి ప్లాన్లేస్తున్న వాళ్ళని నొప్పించకుండా పెళ్ళి కి ఒప్పించాలని తాపత్రయ పడుతూ అమ్మానాన్నలు...
.
పెళ్ళయ్యాక అప్పటి వరకూ యువరాణి లా పెరిగిన తాను,
మొదటిరోజే పనిమనిషౌతుంది....
తన యూనివర్శిటీ డిగ్రీలు,
ఉన్నతోద్యోగం, నాన్న హోదా, తాను తెచ్చిన కట్నం ఇవేవీ తనను కాపాడలేవు,
అమ్మ నాన్నలకు మాట రానివ్వకుండా,
వాళ్ళెంత గుర్తొస్తున్నా ఏడుపుని బయటకు రానివ్వకుండా, సంవత్సరం లోపు ఇష్టం లేకున్నా పిల్లలను కనిపెట్టి,
ఉత్తమ ఇల్లాలు అని పేరు తెచ్చుకున్నప్పుడే
"ఆడదాని గా తన జీవితం సంపూర్ణం"...
కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఇదే ఇక్కడి సంప్రదాయం...
ఉన్నతమైన విలువలున్న నా దేశమా నీకు జోహార్లు 🙏🙏🙏
Comments
Post a Comment