జంతూనాం నరజన్మ దుర్లభం అని ఆదిశంకరులు వక్కాణించినట్లుగా మానవజన్మ మహోత్కృష్టమైనది! 81 లక్షల జీవరాశిలో మానవజన్మే ఉన్నతమైనది అనుకుంటే, ఆ జన్మను సార్ధకం చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అలా ఆలోచించేది ఎందరు భగవంతుడిచ్చిన ఈ జన్మను సార్ధకం చేసుకునేది ఎంతమంది ఈ జీవితాన్ని సరైన రీతిలో నడిపి కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడేది ఎంతమంది అసలు జీవితాన్ని, జీవనాన్ని సుసంపన్నం చేసుకోవాలంటే ఏం చేయాలి. ఎవరిని అనుసరించాలి. ఎవరి బోధలు వినాలి ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం వెతికినప్పుడు లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు. అందరూ అంగీకరించే సూత్రం- వ్యక్తిత్వ వికాసం
ప్రతి జీవికీ మూడు దశలు తప్పనిసరి- పుట్టడం, పెరగడం, పోవడం అనివార్యమైన ఈ జీవన చక్రంలో ఒక వ్యక్తి ప్రతి దశలోనూ పరిణతి చెంది జీవనాన్ని కొనసాగించడమే వికాసంగా భావించాలి. నియమబద్ధమైన జీవనాన్ని సాగిస్తూ, భగవద్గీతలో చెప్పినట్లుగా తనను తాను ఉద్దరించుకుంటూ, సమాజానికి ఉపయోగపడేవాడే ధన్యజీవి
సంగీత సాహిత్యాలతో అటు దైవాన్ని ఇటు సమాజాన్ని అలరించిన వాగ్గేయకారులు సమాజానికి సగటు వ్యక్తకి ఉపయోగపడే అంశాలను ఎంతో ఆందంగా తీర్చిదిద్ది సంకీర్తనలుగా అందించారు.
తెలుగునాట ప్రముఖులైన వాగ్గేయకారులు అన్నమాచార్య త్యాగరాజు, రామదాసు ప్రభృతులు అనేక సంకీర్తనల్లో మనిషి నడవడి ఎలా ఉండాలో, కుటుంబం పట్ల సమాజం పట్ల బాధ్యత ఏమిటో పలు సంకీర్తనల్లో తెలియజెప్పారు ఇతరులను ఎలా నొప్పించకూడదు. ఏది ధర్మం, ఏది నీతి, ఏది నిజమైన భక్తి, ఏది నిత్యం, ఏది సత్యం, ఏది శాశ్వతం, ఏది శాంతి అంటూ విజ్ఞానదాయకమైన విషయాలను తెలియజేస్తూ అందరి ఆత్మోన్నతికి మార్గదర్శనం చేశారు మనిషిని నిరంతరం నడిపేది, వెన్నంటి ఉండేది. ఆలోచన. ఆది సరిగ్గా ఉంటేజీవితం చక్కగా ఉన్నట్లే. మంచి పనికైనా, చెడు పనికైనా ఆలోచనే మూలం ఆలోచన ధార్మికమై, స్త్రీరంగా ఉన్నప్పుడు అది సత్ప్రయోజనం కలిగిస్తుంది.
అన్నమాచార్యులవారు తలపు గురించి తెలియజేస్తూ, 'ఇహ పర సాధనమీ తలపు/సహజ జ్ఞానికి సతమీ తలపు' అంటూ చిత్త చాంచల్యానికి, మనో వికారాలకు లోనుకాకుండా, స్థిరమైన, సరైన ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఇహ పరలోకాల్ని సాధించవచ్చునని అది జ్ఞాని లక్షణమని చెబుతారు.
ఎటువంటివారికైనా అహంకారం పనికిరాదనే విషయాన్ని తెలియజేస్తూ, వొడలి వయోమద ముప్పతిల్లినను/ఆడచి మెలంగుట యది తలపు' అంటూ- ఎదగడం గొప్ప కాదు, ఎదిగినా ఒదిగి ఉండటం గొప్ప అనే సార్వకాలీన, సందేశాన్ని అందించారు
భక్తరామదాసులవారి సాహిత్యాన్ని పరిశీలిస్తే, 'పరులహిలస సేయకున్న పరమధర్మమంతే చాలు' అని 'అహింసా పరమోధర్మ: అనే సిద్ధాంతాన్ని ప్రజలలో ప్రచారం చేశారు. 'పరగ దీన జనులయందు. పక్షముంచితే చాలు అంటూ దీనుల పాలిట కరుణ కలిగి ఉండాలని బోధించిన సామ్యవాది రామదాసు పరోపకారం కంటే పుణ్యం లేదు, పరపీడన కంటే పాపం లేదు' అంటూ పాపపుణ్యాలకు సులభతరమైన నిర్వచనాన్ని అన్నమయ్య అందించాడు. వాగ్గేయకారులు అందించిన ఈ వ్యక్తిత్వ సూత్రాలను ఒడిసి పట్టుకుని, ఆచరించినప్పుడు సమాజంలో శాంతి పరిఢవిల్లుతుంది
- గంధం బసవ శంకరరావు
ఈనాడు, అంతర్యామి 25.1.2021
Comments
Post a Comment