పనిమీద రోడ్డుపై వెళుతూ ఉంటాం. ఒకతను రిక్షాను ఎత్తుకు లాగలేక అవస్థ పడుతూ ఉంటాడు. అది చూసిన మనం రిక్షా వెనక ఓ చెయ్యి వేసి తోసి సహాయం చేయడానికి వెనకాడతాం. ఎవరైనా చూస్తారన్న నామోషీ. చూస్తే అవతలి వాళ్లకు తమ పట్ల చులకన భావన కలుగుతుందన్న జంకు. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం తప్పేమీ కాదు. నెయ్యానికైనా, వియ్యానికైనా సమ ఉజ్జీలు ఉండాలంటారుగాని- సహాయం చేయడానికి, పొందడానికి కాదు.
పనిమనిషి తన ఇంట్లో ఏదో పని ఉండటం వల్లో, తనకో తనవాళ్లకో ఒంట్లో బాగుండక ఒక్క రోజు రాకపోతే మరుసటి రోజు ఆమెపై మనం వ్యక్తం చేసే అసహనం అంతా ఇంతా కాదు. ఆమె అందరిలాంటిదే. కాలం కలిసిరాక గుట్టుగా నాలుగు ఇళ్లలో పనిచేస్తూ గౌరవంగా పొట్టపోసుకుంటోంది. గత్యంతరం లేక- ఇంటివారి పెడసరపు మాటలు భరిస్తుంది. బాధను దిగమింగుకుంటుంది. జానెడు పొట్ట నింపుకోవడానికి పిడికెడు ముద్ద కావాలి కదా! ఆమె మరమనిషి కాదు. మిగతావారిలాగే ఆమెకూ బరువు బాధ్యతలు ఉంటాయి. ముఖ్యంగా మనసు ఉంటుంది. ప్రేమతో పరమాణ్నం పెట్టడమే కాదు కోపంలో సహనం చూపించగలిగితేనే ఆమె మనింటి సభ్యురాలవుతుంది అన్నది మరవకూడదు.
కొంతమంది ఏ చిన్న సమస్య వచ్చినా తమ చుట్టు పక్కల ఉన్నవాళ్లతో కయ్యానికి కాలు దువ్వుతుంటారు. వాళ్లూ తమ లాంటి వారేనన్న స్పృహ ఉండదు. రేపు ఏదన్నా అత్యవసర పరిస్థితి వస్తే ఎక్కడో ఉన్న తమవాళ్లు కాకుండా, దాపున ఉన్నవారే సహాయం చేయడానికి తరలి వస్తారన్న తలంపు కలిగి ఉండాలి.
చెట్టంత ఎదిగిన మనముందు నేలన ఉండే పసితనం ఎంత? మొగ్గ దశ నుంచి పువ్వులుగా మారబోతున్నవాళ్ల చిన్న మెదళ్లను అర్థం చేసుకోక, చిన్న పొరపాటు చేస్తే కొంతమంది కళ్లెర్ర చేస్తారు. లేత చర్మం మీద వాతలు తేలేలా చేయిచేసుకుంటారు- పిల్లలు దేవుడితో సమానం అని తెలిసి కూడా. పిల్లల్లో దైవాన్ని చూడలేని వారు రాళ్లలో చూడాలని ఉవ్విళ్లూరడం వింతే మరి.
తమ పదవి, హోదా, అధికారం, ఆర్థికశక్తి కారణంగా ఎదుటివారిని హీనంగా, హేయంగా చూస్తారు చాలామంది. ఎదుటి వ్యక్తిలో భగవంతుణ్ని చూడాలి. తోటివారిని చిన్నబుచ్చితే మాధవుణ్ని చులకన చేసినట్లే.
మన ఆలోచనల్లో స్వచ్ఛత లేకపోతే, ఎన్ని ఆలయాలు సందర్శించి, ఎంతమంది దేవుళ్లను మరకత మాణిక్యాలతో అలంకరించి, సుగంధ పూలతో, వేద మంత్రాలతో పూజించినా పుణ్యం సంప్రాప్తిస్తుందా?
సమస్త జీవరాశి పట్ల కారుణ్య భావన కలిగి ఉండాలంటారు ద్రష్టలు. సాటి మనుషులను చిన్న చూపు చూసే మానవులు, జీవ జంతుజాలం పట్ల ఉదాత్తంగా, సమదృష్టితో ఎలా వ్యవహరించగలరు?
ఈ భూమ్మీదకు వచ్చిన వాళ్లందరూ రక్తసంబంధం లేకపోయినా, మనకు భ్రాతృ సమానులే. అందరిలో తనను చూసుకునే వ్యక్తి ఉన్నత వ్యక్తిత్వం గల ఉత్తముడు. వయసుతో పాటు మనసు పరిధి విస్తృతం కావాలి. భూమ్మీద ముక్తి సంపాదించుకునే మార్గాలు ఇన్ని ఉన్నా, కారుచీకట్లో కొట్టుమిట్టాడటం మనిషికే చెల్లింది.
‘ఎక్కడో ఏదో ఉందని కాక, ఇక్కడే భూమ్మీద, ఈ జన్మతో దాన్ని సాధించడమే జన్మ సార్థకత’ అని తెలుసుకుంటే ముముక్షు భావనలు మనలో అంకురించినట్లే!
ప్రతి మనిషిలోనూ ఈ మానవత్వ భావనలు వెల్లివిరిస్తే, భూలోకమే ముక్తిదాయక వనం. సర్వత్రా పరిశుద్ధాత్మలు సంచరించే పుణ్యస్థలమై స్వర్గతుల్యమై విలసిల్లుతుంది.
(అంతర్యామి, ఈనాడు దినపత్రిక,30.1.2021)
- ప్రతాప వెంకట సుబ్బారాయుడు
Comments
Post a Comment