మతవిమర్శ చేయాల్సినప్పుడు నేర్చుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన, అధ్యయనం చేయాల్సి న అంశాలు:
1. Being Politically Correct: చేసే వాదన ఏదైనా కానీ, భాషలో, భావంలో కుల, వర్ణ, లింగ, ప్రాంత, భాషా వివక్షలు ఉండకూడదు. మనం నివశించే ప్రాంతపు చట్టాన్ని అది అతిక్రమించకూడదు.
2. ప్రతివాది వాదం ఎంత దిగజారినదైనా మర్యాదపూర్వక సంబోధన కలిగి ఉండాలి.
3. చుట్టూ ఉన్న గుంపు చేసే కేరింతలూ, అరుపుల నడుమ సెన్సేషనల్ డైలాగులు కొట్టి వాళ్ళను అలరించాలనే కుతి వదులుకోవాలి. ఆనక అరెస్ట్ అయితే వాళ్ళెవరూ తోడురారు.
4. ఏదైనా ముతకగా చెప్పాలని బాగా దురద ఉంటే వ్యక్తులూ, దేవుళ్ళూ, మతాల పేర్లను యథాతథంగా వాడకుండా కాస్త మార్చి కొంచెం కోడెడ్ భాషలో (జంతువులు కథలు మొదలైనవి) మాట్లాడటం నేర్చుకోవాలి.
5. సాధ్యమైనంత వరకూ మతాలను చేసే హేళనలో ఆ మతాల పవిత్ర గ్రంధలనూ, వాటిమీద గతంలో ప్రముఖులు చేసిన కామెంట్లను రిఫరెన్సులుగా వాడితే ఆ దోషం వాళ్ళమీదకే పోతుంది. కాబట్టి ఆయా గ్రంధాలలో రాసిన ముడిసరుకును బట్టీపట్టి ఉండటం అవసరం.
6. అన్నిమతాలూ లైంగికత విషయంలో లేకి థియరీలు చెప్పేవే. కానీ అదే విషయాన్ని మనం ప్రస్తావిస్తే మాత్రం మనమాటల్లో తప్పులు ఎంచి మనల్నే లేకిగా ప్రచారం చేస్తారు. కాబట్టి ఏసు ఎలా పుట్టాడు, కుంతీ ఎలా పిల్లల్ని కన్నది, స్వర్గంలో 72 మంది కన్యలు ఉన్నారా, లోతు తన కూతుళ్ళతో పడుకున్నాడా, బ్రహ్మకు సరస్వతి ఏమౌతుంది, ప్రవక్త పసిపిల్లను పెళ్ళాడాడా లాంటి విషయాలను ప్రస్తావించే సమయంలో అపహాస్యం, సెక్స్ పట్ల చీప్ అభిప్రాయాలు ధ్వనించేటట్టు మాట్లాడటంకన్నా ఆయా గ్రంధాలూ, మతబోధకుల మాటల్ని యధాతదంగా కోట్ చేసి వదిలెయ్యడమే మంచిది.
7. ఎన్నడూ ఒక్క మతాన్నే ఎండగట్టే ప్రసంగాలు చెయ్యకూడదు. ఇంచుమించు అలాంటి తర్కం లేని కథలు అన్నిమతాల్లోనూ ఉంటాయి కాబట్టి వాటిని కూడా అదే సమయంలో ప్రస్తావిస్తే ' మమ్మల్ని ఒక్కళ్ళనే కాదు, మిగతావాళ్ళను కూడా ఎంతో కొంత వేసుకున్నాడులే ' అని మతస్తులు సర్దుకుంటారు ( అందరూ కట్టగట్టుకుని దొమ్మీకి కూడా వస్తారు. కానీ కేసులు నిలబడవు).
8. మతాలనూ, మతస్తులనూ హేళన చెయ్యడంకన్నా, వారిలోని అజ్ఞానాన్ని టార్గెట్ చెయ్యడం మన గురి కావాలి. మనజీవితంలో జరిగిన ఒక కాటాస్ట్రోప్ సంఘటన వలన మనం సత్యాన్ని తెలుసుకుని దేవుడూ దయ్యాలను విడిచాము. కానీ ఆ భాగ్యం అనేకమంది జీవితాల్లో కలగలేదు. కాబట్టి వాళ్ళు ఇంకా మతాన్నీ, దానితాలూకు మూర్ఖత్వాన్నీ శరీరానికి చుట్టుకుని జింగలాలా జింగాలాలా డాన్సు చేస్తున్నారు. వాళ్ళపట్ల మనకు సానుభూతి ఉండాలి.
9. ఏ సంఘం పెట్టుకున్నా వాటికి రిజిస్ట్రేషన్ చేయించాలి. సభ్యత్వం మెయింటెయిన్ చెయ్యాలి. ఒకర్ని ఒకరు కాపాడుకోవడం గురించి తగిన తర్ఫీదు ఆ సంఘం సభల్లో ఇవ్వాలి. చట్టపరమైన జ్ఞానం సభ్యులందరికీ అందించాలి. పరిమితులూ, పరిణామాల మీద అవగాహన కలిగించాలి.
10. ఎవరైనా ఒకచోట చేరి మతాలను హేళన చేసి ఈలలూ చప్పట్లూ కొట్టుకుని మురుసుకోవడంకన్నా ప్రజల్ని చైతన్యవంతం చేసే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. మీటింగ్ ఏదైనా అక్కడ ఒక బత్తాయి ఫోనులో మొత్తం వ్యవహారాన్ని రికార్డ్ చేస్తున్నాడు అనే హిడెన్ కాషన్ మన మనసులో ఉండాలి. ఎవరైనా పరిమితులను మీరితే వారిని అక్కడే కరెక్ట్ చేసి సభ ముగించడం ద్వారా చాలావరకు చట్టపరమైన చిక్కులనుండి బయటపడవచు.
11. ప్రసిద్ధ తాత్వికులు, రాజకీయ వేత్తలు, ఉద్యమకారులు, ప్రవచనకారులు మతానికీ దేవుడికీ విరుద్దంగా చేసిన కామెంట్ల వీడియోలు ఒకచోట చేర్చి వాటిని మీటింగులో ప్రదర్శించి దానిమీద మీ ఉపన్యాసాలను కట్టుకుంటే ఎవరూ మిమ్మల్ని టచ్ చెయ్యలేరు.
అన్నిటికీ మించి వేదిక మీద అన్ని కులాల వారు కూడా ఉండేటట్టు చూడండి.. మానవ కవచాల వాడకం తప్పని రోజులు ఇవి! ఫేస్బుక్కులో కమ్యూనిటీ స్టాండర్డ్స్ పేరుతో మీ ఎకౌంట్ ఎప్పుడైనా రెస్ట్రిక్ట్ అవుతుందనే భయం ఉందే... అచ్చం అలాంటి భయంతోనే మీమీ మీటింగులలో మాట్లాడటం మహా మంచిది.
(IndusMartin రాసిన వ్యాసం ఆధారంగా)
Comments
Post a Comment